పరషత్ షెలాహ్ఖ్ మరియు పరషత్ దేవరిమ్ రెండింటిలోనూ కనిపించే వేగులను గూర్చిన ఈ పరాషా, శతాబ్దాలుగా పండితులను ఆకర్షించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అది యెఫున్నే కుమారుడైన కాలేబుతో పోలుస్తూ నూను కుమారుడైన యెహోషువకు గల ప్రత్యేక స్థానం చుట్టూ తిరుగుతూ ప్రధాన ప్రశ్నలలో ఒకటిగా ఉంది.
నూను కుమారుడైన యెహోషువ: అవిశ్వాస ప్రమాదం నుండి ప్రత్యేక రక్షణ.
పరషత్ షెలాహ్ఖ్ లో, మోషే 12 మంది వేగులను కనాను దేశాన్ని సంచరించి చూచుటకు పంపారు, వారిలో నూను కుమారుడైన యెహోషువ గూర్చిఇలా వ్రాయబడింది " దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. (సంఖ్యా కాండము 13:16). మోషే యెహోషువ పేరుకు ముందు "యోద్" (י) (హోషేయ- הוֹשֵׁ֥עַ, యెహోషువ- יְהוֹשֻֽׁעַ) అనే అక్షరాన్ని ఎందుకు జోడించాడని హ్ఖజల్ (తల్మూద్ జ్ఞానులు) ప్రశ్నిస్తారు, ఇది "వేగుల వారి వర్తమానం" నుండి అనగా దేవుని శక్తి మరియు దేశాన్ని జయించే యధార్ధతపై విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుండి రక్షించడానికి ఉద్దేశించిన ప్రత్యేక ఆశీర్వాదమని సూచిస్తుంది -. "వేగుల వర్తమానము” ను౦డి “య” (దేవుని సంక్షిప్త నామము) నిన్ను రక్షిస్తాడు" అని మోషే మాటలను వ్యాఖ్యానిస్తున్నారు ప్రముఖ వ్యాఖ్యాత రాషి గారు.
యెఫున్నే కుమారుడైన కాలేబు: ఆశీర్వాదం అవసరం లేని "సహజ జాతీయవాది".
దీనికి భిన్న౦గా, వేగులలో మరొకరైన యెఫున్నే కుమారుడైన కాలేబుకు ప్రత్యేకమైన ఆశీర్వాద౦ లభి౦చలేదు. జెరూసలేం మాజీ చీఫ్ రబ్బీ గారైన రబ్బీ షాలోమ్ మేషా, యూదా తెగకు చెందిన వ్యక్తిగా కాలేబు ఒక నిర్దిష్ట ఆశీర్వాదం అవసరంలేని, ఇశ్రాయేలు దేశంపై బలమైన మరియు స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉన్న ఒక "సహజ జాతీయవాది" అని వివరించారు.
యెహోషువ: వాస్తవికత నుండి రక్షణ అవసరంలో ఉన్న ఒక యెషివా/తోరా పాఠశాల విద్యార్థి:
కాలేబు వలె కాకుండా, యెషివా/తోరా పాఠశాలలో మోషే యొక్క స్థిరమైన శిష్యుడైన యెహోషువా, వాస్తవికతకు దూరమై, ఇశ్రాయేలు దేశపు జాతీయ ప్రాముఖ్యతను మరచిపోయి, తోరా ప్రపంచంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే ప్రమాదం ఉంది. అందువలన వేగుల ప్రభావం నుండి తనను రక్షించడానికి అతనికి ప్రత్యేకంగా ఒక ఆశీర్వాదం అవసరం.
ఎడారి తరానికి శిక్ష: దేవుని నామాన్ని పరిశుద్ధపరచడానికి ఒక సాధనంగా బహిష్కరణ:
వేగుల వారి అతిక్రమణను అనుసరించి, దేవుడు ఎడారి తరాన్ని అరణ్యంలో 40 సంవత్సరాలు తిరగమని శిక్షిస్తాడు, " నీవు వారితో–దేవుని వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను. " (బెమిద్బార్ /సంఖ్యాకాండము: 14; 28).
ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన నెట్జివ్ ఆఫ్ వోలోజిన్, ఈ శిక్ష ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించడానికి మరియు వారి రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడనందుకు ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి ఉద్దేశించబడిందని వివరించాడు. ఏదేమైనా, ఈ బహిష్కరణకు లోతైన అర్థ౦ ఉ౦దని కూడా ఆయన వాదిస్తాడు: దేశాన్ని జయి౦చడ౦ దేవుని నామాన్ని పరిశుద్ధపరచడానికి ఉద్దేశి౦చబడి౦ది: " అయితే నా జీవముతోడు, భూమి అంతయు దేవుని మహిమతో నిండుకొనియుండును. " (బెమిద్బార్/సంఖ్యాకాండము: 14:22)
ఇశ్రాయేలీయులు సంప్రదాయబద్ధ౦గా దీన్ని సాధి౦చలేకపోతే, దేవుని నామాన్ని ప్రప౦చవ్యాప్త౦గా వ్యాప్తి చేయడానికి చెర(సమస్త జనములలో చెదరగొట్టబడుట) అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గ౦గా ఉపయోగపడుతుంది. చివరికి, ఇశ్రాయేలీయులు తమ దేశానికి తిరిగి వచ్చి తమ జాతీయ విధిని నెరవేర్చుకోగలిగారు.
ముగింపు:
వేగులను గూర్చిన ఈ పరాషా విశ్వాసం, జాతీయవాదం మరియు ప్రపంచంలో ఇశ్రాయేలీయుల పాత్రకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను లేవనెత్తుతుంది. ఎడారి తరానికి విధించిన శిక్షతో పాటు యెహోషువ, కాలేబుల వ్యక్తిత్వాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తే పరష యొక్క అర్థ౦ గురి౦చి, నేటి మన జీవితాల్లో దాని పర్యవసానాల గురి౦చి లోతైన అవగాహనను పొ౦దవచ్చు.