ఇంకిత జ్ఞానము మరియు సహజ నైతికత
బెరిత్ షాలోమ్ అధ్యాయం 2 కొనసాగింపు
ఇక్కడ, మనము నోవహీయ చట్టాల యొక్క ప్రాథమిక సూత్రాల అధ్యయనంలో నిమగ్నమై ఉన్నాము. ఉదాహరణకు, ప్రవక్తల మాటలను తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. పరిశుద్దుడు స్తుతిపాత్రుడైన దేవుడు వ్యక్తులకు తనను తాను వెల్లడి చేసుకున్నప్పుడు , వారు ప్రవక్త చెప్పేది వినడానికి బాధ్యతకలిగి వుంటారు.
అయితే, ఎల్లప్పుడూ ప్రవక్తలు ఉండరు. ఇంగితజ్ఞానం మరియు సహజ నైతికత అని పిలవబడేవి కూడా వున్నాయి. ఇదే నాల్గవ సూత్రం - సహజ నైతికత, ఇంగితజ్ఞానం మరియు సరైన ప్రవర్తన అనేవి పునాధిగా వున్న అన్ని ఆజ్ఞలకూ నోవహీయులు కూడా కట్టుబడి వుండాలి.
ఉదాహరణకు, తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం వంటి ఆజ్ఞలు మరియు ఇలాంటి చర్యలు, ఏడు నోవహీయ ఆజ్ఞల జాబితాలో చేర్చబడలేదు, అయితే "దెరెఖ్ ఎరెట్జ్ కద్మా లెతోరా" అని పిలువబడే సహజ నైతికత ద్వారా ప్రజలకు ఇవి తప్పనిసరి చేయబడ్డాయి(తోరాకి ముందు సరైన ప్రవర్తన ఉంటుంది).
కొన్నిసార్లు వివిధ మతపరమైన పద్ధతులను పరిచయం చేయాలనే కోరిక ఉంటుంది: ప్రార్థనలు, బలులు లేదా ప్రత్యేక పండుగ దినాలు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది - ఇది ఎలా చేయాలి? ఇక్కడ, నేను ఇలా వ్రాశాను: "ఇశ్రాయేలు జ్ఞానుల ఆమోదం లేకుండా యూదులు కానివారు తమ స్వంత అవగాహన నుండి తమ కోసం కొత్త మతపరమైన ఆజ్ఞలను ఏర్పాటు చేయకూడదు." నా మాటలను మనము నిశితంగా పరిశీలిస్తే, నేను "నోవహీయులు కొత్త ఆజ్ఞలను సృష్టించకపోవచ్చు" అని చెప్పలేదు, కానీ "యూదులు కానివారు" అని చెప్పాను. న్యాయస్థానం ముందు ఏడు నోవహీయ ఆజ్ఞలను అధికారికంగా స్వీకరించని వారు, ఇశ్రాయేలు జ్ఞానుల మార్గదర్శకత్వం లేకుండా మతపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయకూడదని మేము సలహా ఇస్తున్నాము, లేదంటే ఇది తీవ్రమైన నైతిక తప్పిదాలకు దారితీయవచ్చు. అయితే, ఒక నోవాహీయుడు ఏదైనా పరిచయం చేయాలనుకుంటే, ఇశ్రాయేలులోని కొందరు జ్ఞానులు అలా చేయడానికి అతనికి అనుమతిస్తారు.
సహజంగానే, ప్రపంచాన్ని మెరుగుపరచడం వంటి అదనపు అంశాలు ఉన్నాయి. మనము ప్రపంచాన్ని నిర్మిస్తాము మరియు జ్ఞానం యొక్క విస్తరణ, నైతిక ఔన్నత్యం మరియు సృష్టి యొక్క సమగ్రత పట్ల శ్రద్ధతో సహా సాంకేతిక పురోగతి దాని అభివృద్ధికి దోహదపడుతుంది. ఉదాహరణకు, జీవావరణ శాస్త్రం మరియు పర్యావరణ నాణ్యత ప్రపంచానికి దైవ సంకల్పం యొక్క ముఖ్యమైన అంశాలు. విజ్ఞాన శాస్త్రాన్ని మరియు మానవాళికి మేలు చేసే ఏదైనా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. అధికారికంగా ఆజ్ఞాపించకపోయినా, దైవ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఇది భాగం.